హైదరాబాద్‌‌‌‌లో ‘రాఘవ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్’ ఓపెన్

హైదరాబాద్‌‌‌‌లో ‘రాఘవ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్’ ఓపెన్
  • మంత్రి పొంగులేటి, డాక్టర్ సతీశ్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లోని కోకాపేట్‌‌‌‌లో "రాఘవ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్" అనే సంస్థను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి డీఆర్డీఓ మాజీ చైర్మన్, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ జి. సతీష్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో రక్షణ తయారీ రంగం గణనీయమైన ప్రగతి సాధించిందన్నారు. క్షిపణులు, బాంబులు, గన్‌‌‌‌ల తయారీలో ప్రైవేట్ పరిశ్రమల భాగస్వామ్యం దాదాపు 40 శాతానికి చేరిందని తెలిపారు.

ఆత్మనిర్భర్ భారత్ చొరవ కింద రక్షణ బడ్జెట్‌‌‌‌లో స్వదేశీ తయారీకి కేంద్ర ప్రభుత్వం రూ.1.39 లక్షల కోట్లు కేటాయించిందని చెప్పారు. ఇది భారతీయ పరిశ్రమలకు ఉన్న గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ఆయుధాలు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి భారత్ రూపాంతరం చెందిందని, ఆర్మేనియా తన రిపబ్లిక్ డే పరేడ్‌‌‌‌లో మూడు భారతీయ ఆయుధ వ్యవస్థలను ప్రదర్శించడమే దీనికి నిదర్శనమని గుర్తుచేశారు. ఈ సందర్భంగా  ‘పెరిడాట్ అడ్వాన్స్‌‌‌‌డ్ మెటీరియల్స్’  సంస్థ భాగస్వామ్యంతో 'ఎంఎఎల్ఈ-300' అనే స్వదేశీ మేల్​-క్లాస్ ఐఎస్ఆర్​అన్‌‌‌‌మ్యాన్డ్ ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్ (డ్రోన్) జాయింట్ వెంచర్‌‌‌‌ను ప్రకటించారు.

ఈ డ్రోన్ 300 కిలోల పేలోడ్, 30 గంటల ఓర్పు  30,000 అడుగుల ఎత్తులో ఎగిరే సామర్థ్యంతో పూర్తి భారతీయ డిజైన్ ఐపీ హక్కులను కలిగి ఉంటుందని వెల్లడించారు. రాఘవ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ..ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్ వార్‌‌‌‌ఫేర్, మిస్సైల్ ఆర్​ఎప్​ సిస్టమ్స్, కాంపోజిట్ స్ట్రక్చర్స్ ఎంబెడెడ్ సిస్టమ్స్ వంటి రంగాల్లో  నాణ్యమైన సేవలు అందిస్తుందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ లిఖిత్ రెడ్డి పొంగులేటి పేర్కొన్నారు.